ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఏకంగా రూ.1,000 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది.
ఈ మేరకు నిధులకు పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిధులతో రాష్ట్రంలోని మొత్తం 274 రహదారులను బాగుచేయనున్నారు. మంజూరైన నిధులను రాష్ట్ర, జిల్లా రహదారుల పనులకు వేర్వేరుగా కేటాయించారు.
ఇందులో భాగంగా, రాష్ట్ర రహదారుల (స్టేట్ హైవేస్) పరిధిలోని 108 పనుల కోసం రూ.400 కోట్లు కేటాయించారు.
అదేవిధంగా, వివిధ జిల్లాల్లోని ముఖ్యమైన 166 రహదారుల మరమ్మతుల కోసం రూ.600 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.