telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

మళ్ళీ టీడీపీ-బీజేపీ కలుస్తాయి.. : అసదుద్దీన్ ఒవైసీ

oyc president on congress-tdp alliance

హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. ఎన్నికల అనంతరం కేంద్రంలో సంభవించే రాజకీయ పరిణామాలను ఆయన ముందే అంచనా వేశారు. ఎన్నికల తరువాత కేంద్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని అన్నారు. భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గానీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గానీ ఈ సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని ఒవైసీ స్పష్టం చేశారు. ఈ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.

ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల బహిరంగ సభలో ప్రసంగించారు, రోడ్ షో లను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల అంశాలను ప్రస్తావించారు. కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమేనని, దీనికి ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వం వహిస్తుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలు చక్రం తిప్పుతాయని చెప్పారు. భావసారూప్యం గల పార్టీలన్నీ ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతాయని చెప్పారు. దీనికోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి జాతీయ నాయకులు ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

ఒవైసీ, ఏపీసీఎం చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలు చేశారు. ఆయనకు మరోసారి అవకాశం లభిస్తే.. యూటర్న్ తీసుకుంటారని అన్నారు. మళ్లీ బీజేపీకి మద్దతు ఇస్తారని, ఎన్డీఏ కూటమిలో చేరిపోతారని చెప్పారు. చంద్రబాబుకు ఈ సారి రాజకీయంగా ఎలాంటి అవకాశాలు రాకూడదని తాను కోరుకంటున్నట్లు చెప్పారు. 2004 ఎన్నికల సందర్భంగా బీజేపీతో జట్టు కట్టబోనని బహిరంగంగా క్షమాపణలు కోరిన చంద్రబాబు.. 2014 నాటికి అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అబద్ధాలు ఆడటంంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ ఉందని ధ్వజమెత్తారు. ఏపీలోని ముస్లిం ఓటర్లు ఎవరూ టీడీపీకి ఓటు వేస్తారని తాను అనుకోవట్లేదని అన్నారు. చంద్రబాబు పరిపాలనపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని, అయిదేళ్ల పాటు అవకాశం ఇస్తే.. ఏపీకి ఏం చేశారని ఒవైసీ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ రావాలని, జగన్ కావాలని కోరుతున్నారని, పోలింగ్ సందర్భంగా వారి మనోభిప్రాయాలను ప్రతి ఫలిస్తాయని చెప్పారు. ఎన్నికల అనంతరం కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం, ఏపీలో వైఎస్ఆర్ సీపీ సర్కార్ ఏర్పాటు కావడం తథ్యమని అన్నారు.

Related posts