ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే మండపాల నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఈ పండుగల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం వెల్లడించారు.
వినాయక ఉత్సవ సమితుల నుంచి తన దృష్టికి వచ్చిన వినతి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చలు జరిపినట్లు లోకేశ్ తెలిపారు.
ఈ చర్చల ఫలితంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందని ఆయన వివరించారు.
ఈ ప్రయోజనాన్ని కేవలం వినాయక చవితికే పరిమితం చేయకుండా, రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసే దుర్గా పందిళ్లకు కూడా వర్తింపజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఈ రెండు ప్రధాన పండుగల కోసం ఉచిత విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం రూ. 25 కోట్లు వెచ్చించనుందని ఆయన వెల్లడించారు.
ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుందని లోకేశ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఉత్సవ కమిటీలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.