telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్‌ఎస్‌కు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గుడ్‌బై..ఆదరించే పార్టీలో చేరుతా..లేదంటే

తెలంగాణ టీఆర్ ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పారు. .

2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్‌రావు.. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినట్లు ఆదివారం ప్ర‌క‌టించారు.

టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సందర్భంగా వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆశ జూపి అవమానించారని ఆవేద‌న చెందారు. 9 సంవత్సరాలు టీఆర్ఎస్‌‌లో క్రమశిక్షణతో ఉండి నిస్వార్ధంగా పనిచేశానని, పదవులు ఇయ్యకున్నా పార్టీకి సేవ చేస్తూనే ఉన్నానని ఆయన గుర్తుచేశారు.

పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డాను. అన్నీ సహించి ఇన్నాళ్లూ కొనసాగాను. బంగారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశాను అని అన్నారు. కనీస గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమని, సంస్కారం లేని నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వ్యాఖ్యానించారు.ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీకి వెళ్తా.. లేదంటే స్వతంత్రంగా పోటీ చేసి గెలుస్తా అని స్పష్టం చేశారు .

ఇక పోతే స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అవమానపరిచేలా మాట్లాడారు. పార్టీలో ఉండగానే ఎమ్మెల్యే మమ్మల్ని తిట్టారు. ఆయన తిట్టినా టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరూ దాన్ని ఖండించలేదు.

ఎమ్మెల్యే నరేందర్‌ రాజీనామా చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. చీరుస్తా, పాతరేస్తా అంటే పార్టీలో ఉండాలా అని ప్ర‌శ్నించారు. తన సహకారం లేకుండా నరేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందితే పదో తారీకు లోపు రాజీనామా చేయ్యి అని స‌వాల్ విసిరారు.

నరేందర్ రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామ‌ని, బతికున్నన్ని రోజులు ఆయనకు సేవకుడిగా పని చేస్తా అని తెలిపారు. పదో తారీకు వరకు రాజీనామా చేయకుంటే ఎక్కడికి రమ్మన్నా వస్తా బహిరంగ చర్చకు సిద్ధం. 4 వేల కోట్లు ఎక్కడ పెట్టి అభివృద్ధి చేశావో చెప్పు అని అన్నారు.

Related posts