*బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ పర్యటన
*ఒక తల్లిగా ఇక్కడికి వచ్చాను..
*విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా…
*ఆర్జీయూకేటీ విద్యార్థులు అసహనంతో ఉన్నారు
నిర్మల్ జిల్లా బాసరలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన ముగిసింది. బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు, అధికారులతో గవర్నర్ ముఖాముఖి సమావేశమై చర్చించారు. విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు.
ట్రిపుల్ ఐటీలో మెస్, ల్యాబ్, లైబ్రరీ , హాస్టల్ గదులు, వాష్ రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హాస్టల్ సమస్యలతో పాటు అకాడమిక్ సమస్యలను గవర్నర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ..తాను ఒక అమ్మగా ఇక్కడికి వచ్చా అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వచ్చానని, మెస్ నిర్వహణపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు.
ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు అందరికీ తెలిసినవేనని, సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించానన్నారు. సెక్యూరిటీ సమస్యలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అధ్యాపకుల భర్తీతో సహా టైమ్ బాండ్ ప్రకారం సమస్యలను పరిష్కరించాలని, విలువలతో కూడిన విద్య, స్నేహపూర్వక వాతావరణం కలిపించాలని అధికారులకు సూచించినట్లు గవర్నర్ తమిళి సై వ్యాఖ్యానించారు.
అంతకుముందు చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు.