లాక్‌డౌన్ నేపథ్యంలో జాతీయస్థాయిలో వివిధ ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పొడిగించింది. యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్ నెట్, ఐసీఏఆర్, జేఎన్‌యూఈఈ, ఇగ్నో ఓపెన్ మ్యాట్ పరీక్షల దరఖాస్తులను జూన్ 15 వరకు సమర్పించవచ్చని వెల్లడించింది. ఆయా పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు గడువు మే 31తో ముగిసింది.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికోసం మరో మారు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. ఎన్‌టీఏ వెబ్‌సైట్ ద్వారా జూన్ 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లను స్వీకరిస్తామని, రాత్రి 11.50 గంటల వరకు అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చని ఎన్‌టీఏ తెలిపింది.