telugu navyamedia
National వార్తలు సాంకేతిక

బ్రహ్మోస్ క్షిపణుల సామర్థ్యాల నుంచి శత్రుదేశాలు తప్పించుకోలేవు: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణుల రేంజ్‌లోనే ఉందని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ యూనిట్‌ను ఆయన శనివారం నాడు సందర్శించారు. ఇక్కడ తొలివిడత తయారైన బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి ఆయన అప్పగించారు.

ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసిన భారత సాయుధ బలగాలను రాజ్‌నాథ్ ప్రశంసించారు. అయితే ఇది కేవలం ట్రయిలర్ మాత్రమేనని అన్నారు. దేశంలోని క్షిపణి సామర్థ్యాల నుంచి శత్రుదేశాలు తప్పించుకోలేవన్నారు.

‘విజయం ఇకపై మనకు చిన్న సంఘటన కాదని ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. విజయం మన అలవాటుగా మారింది.

మన శత్రువులు ఇకెంతమాత్రం బ్రహ్మోస్ నుంచి తప్పించుకోలేరనే ధీమా దేశ ప్రజల్లో కలిగింది. ఇప్పుడు పాక్‌లో అణువణువు బ్రహ్మోస్ రేంజ్‌లోనే ఉంది’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

బహ్మోస్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదని, దేశంలో పెరుగుతున్న స్వదేశీ సాంకేతికత, సామర్థ్యాలకు నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

వేగం, కచ్చితత్వం, శక్తి ముప్పేటగా రూపొందిన ప్రపంచంలోనే ఉత్తమ క్షిపణి ఇదని అభివర్ణించారు. భారత సాయుధ బలగాలకు బ్రహ్మోస్ ‘వెన్నెముక’గా మారిందన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రక్షణ అవసరాలను తీర్చే స్వావలంభనకు బ్రహ్మోస్ క్షిపణి ప్రతీకని అన్నారు.

సొంత రక్షణ అవసరాలను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్ర దేశాల రక్షణావసరాలను తీర్చగలిగే సామర్థ్యాన్ని భారత్ సంతరించుకుందని చెప్పారు.

Related posts