telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఒంటరిగా ఉన్న మహిళను హిప్నోటైజ్ చేసి… అమెజాన్ డెలివరీ బాయ్ నిర్వాకం

Food-Delivery-Boy

ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న ఓ మహిళ (43)పై డెలివరీ బాయ్ దారుణానికి తెగబడ్డాడు. నోయిడాలో సోమవారం (అక్టోబర్ 7) చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… ఆమె ఇటీవలే అమెజాన్‌లో ఆమె ఆర్డర్ చేసిన వస్తువులు డెలివరీ కాగా… అవి నచ్చకపోవడంతో అమెజాన్‌కు తిరిగివ్వాలని భావించింది. అమెజాన్ కస్టమర్ కేర్‌కు డయల్ చేసి ఆ విషయాన్ని తెలుపగా.. సోమవారం నాడు డెలివరీ బాయ్‌ను పంపించారు. బాధితురాలు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చిన డెలివరీ బాయ్.. అక్కడి రిజిస్టర్‌లో తన పేరును భూపేందర్ పాల్‌ (30)గా ఎంట్రీ చేశాడు. సదరు మహిళ అన్ని వస్తువులను తిరిగిచ్చేయాలని భావించగా.. అతడు మాత్రం నాలుగింటినే తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో ఆమె అమెజాన్‌కు కాల్ చేయగా.. సిబ్బంది స్పందించి ఆ వస్తువులను తిరిగి తీసుకునేందుకు మరో వ్యక్తిని పంపిస్తామని చెప్పారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి మన్నించాలని కోరారు. దీంతో భూపేందర్ అక్కడి నుంచి వెనుదిరిగాడు. 10 నిమిషాల తర్వాత డెలివరీ బాయ్ భూపేందర్ పాల్ దురుద్దేశంతో మళ్లీ ఆ మహిళ ఫ్లాట్‌కు వచ్చాడు. ఆ మహిళ మాత్రం వస్తువులను ఇవ్వడానికి నిరాకరించింది. అతడితో మాట్లాడుతూనే ఆమె క్రమంగా సృహ కొల్పోయి పడిపోయింది. కాసేపటి తర్వాత మెలకువ రావడంతో తేరుకున్న బాధితురాలు ఎదురుగా భూపేందర్‌ను చూసి షాక్‌కు గురైంది. అతడు తన ప్యాంట్‌ను కిందకి జార్చి నిల్చొని ఉండటాన్ని ఆమె గమనించింది. జరగబోతున్న దారుణాన్ని గ్రహించి వెంటనే పెద్దగా అరుస్తూ వాష్‌రూమ్‌లోని క్లీనర్‌తో అతడిపై దాడికి దిగింది. దీంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తన చెల్లెలి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత మహిళ తెలిపింది. అమెజాన్ డెలివరీ బాయ్ తనను హిప్నొటైజ్ చేసి అత్యాచారం చేయబోయాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అపార్ట్‌మెంట్ రిజిస్టర్‌లో ఎంట్రీ చేసిన వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఘటనపై అమెజాన్ స్పందించింది. నిందుతుడిపై తక్షణ చర్యలు తీసుకుంటామని.. దర్యాప్తులో పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపింది.

Related posts