మొంథా తుఫాన్ వల్ల రహదారులకు జరిగిన నష్టంపై ఆర్ అండ్ బీ శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.
రహదారుల ధ్వంసంపై అంచనా వేసి, నష్టం వివరాలు సమర్పించాలన్నారు. తుఫాన్ తీవ్రత తగ్గినందున సాధ్యమైనంత వేగంగా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు సమర్థంగా పని చేయాలని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
తుఫాన్ వల్ల దాదాపు 4576 కి.మీ మేర ఆర్ అండ్ బీ రహదారులు ధ్వంసమైనట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. 120 చోట్ల ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బ తిన్నాయని, ఇప్పటికే 21 చోట్ల పునరుద్దరణ చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల రహదారులు కోతకు గురికాగా, 7 చోట్ల పునరుద్ధరించినట్లు వెల్లడించారు. 302 కల్వర్టులు ధ్వంసం కాగా, ఇప్పటి వరకు 75 చోట్ల సరిచేసినట్లు వివరించారు. ధ్వంసమైన రోడ్ల తాత్కాలిక పునరుద్దరణకు రూ. 272 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
తాత్కాలిక, శాశ్వత రహదారుల పునరుద్ధరణకు మొత్తం రూ. 2713 కోట్లు అవసరమని ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు.
మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు రోడ్డుపై విరిగి పడ్డాయి. వాగులు, కాలువలు, నదులు పొంగిపొర్లుతున్నాయి.
ఆ వరద నీరు భారీగా రోడ్లపై చేడంతో పలు చోట్ల తీవ్రంగా రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. తుఫాన్ తగ్గుముఖం పట్టడంతో.. ఆర్ & బీ శాఖ దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించే పనిలో పడింది.

