ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలనేది తన అభిప్రాయమని జగన్ చెప్పారు. జనం గుమిగూడకుండా మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలని కోరారు. మిగతా ప్రాంతాల్లో భౌతికదూరం పాటించాలన్నారు. మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకు సాగుతామని జగన్ స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగంపై లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా తగ్గింది. 90శాతం పరిశ్రమలు కరోనా ప్రభావంతో మూతపడ్డాయి. రాష్ట్రాలకు ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొంది. సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడింది. ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతింటోంది. లాక్‌డౌన్ వల్ల పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో 37 మండలాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయని, 44 మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని, 595 మండలాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయని మోదీకి జగన్ వివరించారు.

