telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రజలతో పరిహాసం… నెల్లూరు జిల్లాలో కాలుష్యం..

కాలుష్య గరళం మింగి..కాలం గడుపుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్ర పడియ గ్రామం కాలుష్య కాసారంగా మారుతోంది. స్థానికంగా వున్న వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్ కెమికల్ ఫ్యాక్టరీ తో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కెమికల్ వ్యర్థాలు కలిసిన నీరు సమీప గ్రామాల చెరువుల్లోకి వదలడంతో ఈ ప్రాంతమంతా కలుషితమయంగా తయారవుతోంది. కెమికల్ వ్యర్థాల వల్ల పశువులు మృత్యువాత పడుతున్నాయి, పంటలు పాడైపోతున్నాయి, స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ దుస్థితిపై అధికార్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు.

కాలుష్య కారక కెమికల్ ఫ్యాక్టరీ పై పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని గ్రామస్థులు, రైతులు ఆరోపించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారుల తీరును నిరసిస్తూ గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు.

పట్టించుకోవాల్సిన పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన చెందారు. అధికారు సారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అలక్ష్య వైఖరి వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా తాము ఆందోళన చేస్తుంటే, పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా తమను రసాయన కర్మాగార కాలుష్య కష్టాల నుంచి కాపాడాలని గ్రామస్థులు వేడుకొంటున్నారు.

Related posts