టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. లోక్ సభలో పార్టీ విప్ గా వ్యవహరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని నాని తిరస్కరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో ఆయన పార్టీ మారతారంటూ ఊహాగానాలు బయల్దేరాయి. ఈ నేపథ్యంలో, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మధ్యవర్తిత్వానికి ప్రయత్నించారు. కేశినేని నానితో మాట్లాడి చంద్రబాబుతో చర్చలకు ఒప్పించారు.
చంద్రబాబు తన నివాసానికి నాని, జయదేవ్ లను పిలిపించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వారితో చంద్రబాబు భేటీ ముగిసింది. సమావేశంలో భాగంగా కేశినేని నానితో చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడారు. నాని మనసులో మాటను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో కలిసికట్టుగా పోరాడాల్సి ఉందని, అందుకోసం అందరూ సహకరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.