టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ వ్యవహారాలపై ఫోకస్ చేశారు. తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కీలక నేతలతో సమావేశమయ్యారు.
సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలంటూ తెలంగాణ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ టీడీపీ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఇందులో ప్రధానంగా తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించడం, రాష్ట్ర, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం వంటి సంస్థాగత అంశాలపై చర్చించారు.
ఇప్పటికే మండల అధ్యక్షుల నియామకానికి సంబంధించిన కసరత్తు పూర్తయిందని, దానిని వెంటనే పూర్తి చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో పార్టీకి 1.78 లక్షల సభ్యత్వ నమోదు పూర్తయినట్లు నేతలు చంద్రబాబుకు వివరించారు.
గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, సరైన నాయకత్వం అందిస్తే పార్టీని మళ్లీ క్రియాశీలంగా మార్చవచ్చని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యమైతే, తాత్కాలికంగా ముఖ్య నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
నేతల అభిప్రాయాలను విన్న చంద్రబాబు, పార్టీ బలోపేతంలో భాగంగా రెండు మూడు రోజుల్లో 638 మండల కమిటీలు, డిజవిన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
వీలైనంత త్వరగా కమిటీల నియామకం పూర్తి చేసి, పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు. పార్టీని సమర్థవంతంగా నడిపించగల నాయకుడికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని నేతలకు స్పష్టం చేశారు.
చాలాకాలం తరువాత తెలంగాణ నేతలతో చంద్రబాబు సమావేశం కావడంతో పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహాలో తెలంగాణ టీడీపీ వ్యవహారాలపై చంద్రబాబు మరింతగా దృష్టి పెట్టే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు.
జై శ్రీరాం బదులు జై హింద్: మమత