టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ఎట్టకేలకు అరెస్టయ్యారు. దళితులను దూషించిన కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని గత పన్నెండురోజులుగా అజ్ఞాతంలో లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి చింతమనేని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు రెచ్చిపోయారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు చింతమనేని అరెస్టు చేశారు. అనంతరం రహస్య ప్రదేశానికి తరలించారు.
పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చింతమనేని 12 రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.