ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు. కోల్ కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బెంగాల్ అభివృద్ధి కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరోమారు పట్టం కట్టాలని కోరారు. మమతా బెనర్జీ నేతృత్వంలోనే బెంగాల్ అభివృద్ధి జరుగుతుందన్న చంద్రబాబు, ఆమెను ‘బెంగాల్ టైగర్’గా అభివర్ణించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఓటర్లకు కొన్ని సూచనలు చేశారు. ఓటు వేసిన తర్వాత తమ ఓటు ఏ పార్టీకి వేశామో ఆ పార్టీకే పడిందో లేదో అన్న విషయం వీవీప్యాట్ స్లిప్సులను సరిచూసుకోవడం ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. ఓటింగ్ సమయంలో ఎవరైనా తప్పు చేస్తే నిలదీయాలని సూచించారు. ఈ నెల 23న బీజేపీ ఓటమి చవిచూడబోతోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 23 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడం తథ్యమని అన్నారు.