telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

పెళ్లిళ్ల సందడి .. ఈ నెలలోనే .. ఎక్కువ ముహుర్తాలు ..

Ready to 2nd marriage arrested jagityal

పెళ్లిళ్ల సీజన్ కావడంతో అంతటా బాజా భజంత్రీలతో పెండ్లి సందడికి ముస్తాబైంది. అసలే మే నెల కావడంతో భానుడు భగభగ మండుతుండగా అదే స్థాయిలో పెళ్లిళ్ల సందడికి కల్యాణ మండపాలు సిద్ధమవుతున్నాయి. 2019 ఆరంభం నుంచి అరకొరగా ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల 4వ తేదీతో అమావాస్య ముగిసింది. చైత్ర మాసం పూర్తయ్యింది. ఆదివారం నుంచి వైశాఖ మాసం ప్రారంభమైంది. దీంతో దుస్తులు, బంగారం ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పెళ్లిళ్లకు అవసరమైన వస్తు సామగ్రిని కొనుగోలు చేసేందుకు నగరానికి దగ్గరగా ఉన్న జిల్లాలతో పాటు శివారు ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుండటంతో నగరంలోని దుకాణాల్లో రద్దీ నెలకొంది.

పల్లెటూళ్ళు, నగరం అని తేడా లేకుండా.. పెండ్లి బాజాలు మోగనున్నాయి. మే నెల మొత్తం మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీని తో శుభకార్యాలతో ప్రతి ఇల్లు సందడిగా మారనుంది. మాసం ఆరంభంలో సోమ, మంగళ వారాలు రావడంతో శుభకార్యాలకు ఎక్కువమంది ఆసక్తి చూపలేదు. నేటి(బుధవారం) నుంచి పూర్తి స్థాయిలో శుభకార్యాలు మొదలవుతాయని పండితులు చెబుతున్నారు. ఒక్క మేలోనే వేల సంఖ్యలో శుభకార్యాలు ఉన్నాయని, అందులోనూ 15, 16, 29 తేదీల్లో అధిక సంఖ్యలో పెండ్లీలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.

గతానికి భిన్నంగా ప్రస్తుతం శుభ కార్యాలన్నింట్లోనూ విందు క్యాటరింగ్ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వంట వారు సరిగా అందుబాటులో లేకపోవడం, వస్తువులు సమకూర్చుకోవడం.. ఆ తర్వాత వడ్డన ఇదంతా పెద్ద ప్రహసనమని ఎక్కువ మంది భావిస్తున్నారు. నగరంలో క్యాటరింగ్ చేసే వారు ఎవరికి ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో విందు భోజనాలను తయారీ చేసి అందిస్తున్నారు. దీంతో క్యాటరింగ్‌లపై ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. గతంలో వంద నుంచి రెండు వందల మంది అతిథులు ఉంటే క్యాటరింగ్‌ను ఆశ్రయించేవారు. కాని ఇప్పుడు వేల మంది అతిథులైనా అందుకు తగ్గట్టే క్యాటరింగ్ సంస్థలు కూడా వాటి సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. ఒక్కో ప్లేటుకు రూ.120 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. మరి కొందరు సౌత్‌ఇండియా, నార్త్ ఇండియా తదితర వంటకాలు అడుగుతుండటంతో దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నట్లు క్యాటరింగ్ నిర్వాహకులు తెలుపుతున్నారు.

పెండ్లీల నేపథ్యంలో బంగారం ధర స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చిన విషయం. గ్రాముకు రూ.40 వరకు తగ్గిందని బంగారం వ్యాపారులు తెలుపుతున్నారు. ధర అటుంచి పెండ్లీల నేపథ్యంలో బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఎక్కువమంది వస్తువులను అర్డర్‌లపై చేయించుకోవడం కంటే ముందుగానే తయారు చేసిన రేడీమేడ్ నగలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వధువుకు, వరుడికి కావాలసిన నగలను పూర్తిస్థాయి సెట్ల రూపంలో దుకాణదారులు అందించడంతో వినియోగదారులు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. వీటితోపాటు వస్త్ర దుకాణాలు కూడా రద్దీగా మారాయి. పండుగల సమయంలో ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు ఇప్పుడు కూడా అందుబాటులోకి తెచ్చి దుకాణదారులు వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

నెల మొత్తం మంచి ముహూర్తాలు ఉండటంతో కల్యాణ మండపాల(ఫంక్షన్ హాల్స్)కు గిరాకీ ఏర్పడింది. పైగా ఈ సారి ఎక్కువగా మధ్యాహ్నం ముహూర్తాలు ఉండటంతో ఏసీ కల్యాణ మండపాలకు మరింత డిమాండ్ ఏర్పడింది. వీటి ధరలు కూడా రూ.లక్ష నుంచి ఆరు లక్షలు వరకు ఉండటంతో వారివారి స్థాయిలను బట్టి మండపాలను ఇప్పటికే బుక్ చేసుకున్నారు. పెండ్లీలతోపాటు శుభకార్యాలు కూడా ఆధికంగా ఉండటంతో చిన్న, చిన్న ఫంక్షన్ హల్స్‌కు కూడా డిమాండ్ ఏర్పడింది. వీటితో పాటు పురోహితులకు, సన్నాయి వాయిద్యకారులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. గతంలో ఒక పెండ్లికి ఒక్క పురోహితుడు మాత్రమే ఉండి తంతు పూర్తి చేసేవారు. కానీ ఈ మధ్య ఎక్కువ వివాహల్లో ఇద్దరు పురోహితులు ఉండి కార్యక్రమం జరిపిస్తున్నారు. దీంతో వారే కాకుండా బయట నుంచి కూడా పురోహితులను తెప్పించుకుంటున్నారు. అంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మామూలు శుభకార్యాలకు ముగ్గురు వాయిద్యకారులు ఉంటే సరిపోతారు. పెండ్లికి కనీసం ఐదుగురు కావాలి. దీంతో వీరికి డిమాండ్ పెరిగింది. డిమాండ్‌ను బట్టి ఒక్కో పెండ్లికి రూ.10 వేల నుంచి 20 వేల వరకు తీసుకుంటున్నారు.

ఈ నెల 15, 16, 29 తేదీల్లో భారీగా పెండ్లీలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అనువైనది. మే 5వ తేదీ నుంచి వైశాఖ మాసం ప్రారంభంకావడంతో పాటు తిరిగి శుభ గడియలు రావడంతో నగరంలో అధిక పెండ్లీలు జరుగనున్నాయి. దీంతో ఈ నెలలోనే అధిక సంఖ్యలో శుభకార్యాలు జరుగనున్నాయి. జూన్ 4వ తేదీ నుంచి జైష్టమాసం ప్రారంభమవుతుందని పండితులు తెలిపారు.

Related posts