తమిళనాడులో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం చెన్నైలో ఏకంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది.
రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి అందిన ఒక ఈ-మెయిల్‌లో, ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు అమర్చినట్లు ఆగంతుకులు హెచ్చరించారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ బృందాలను, పోలీసు బలగాలను ఉపరాష్ట్రపతి నివాసానికి పంపించారు.
భవనం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఇది కేవలం భయభ్రాంతులకు గురిచేసేందుకు చేసిన బూటకపు బెదిరింపు అని నిర్ధారించారు.
ఈ-మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.