*సాయంత్రం హన్మకొండలో బీజేపీ భారీ బహిరంగ సభ
*బహిరంగ సభకు జెపీ నడ్డా హాజరు
*హీరో నితిన్, క్రికెటర్ మిథాలీరాజ్‌తో భేటీ కానున్న జేపీ నడ్డా
గత కొన్ని నెలలుగా రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రఈరోజుతో ముగియనుంది.. ఈ సందర్భంగానే ఇవాళ హన్మకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా పాల్గొననున్నారు.
వరంగల్ లో బీజేపీ ముగింపు సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సభతో గులాబీ దళానికి గట్టి కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది. మధ్యాహ్నానికి హన్మకొండ చేరుకోనున్న నడ్డా… బండి సంజయ్‌తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రానికి రాజగోపాల్‌రెడ్డితో సమావేశమై మునుగోడు ఉపఎన్నికలపై చర్చిస్తారు.
బహిరంగ సభ పూర్తైన తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో నితిన్-నడ్డాల సమావేశం జరగబోతోంది. అనంతరం రాత్రి 7 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ఈ భేటీపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది .
బీజేపీ అగ్రనేతలు టాలీవుడ్ స్టార్స్‌తో భేటీ అవుతుండడం ఆసక్తి రేపుతోంది. ఈనెల 21న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సమావేశమయ్యారు. నోవాటెల్ హోటల్లోనే వీరిద్దరి మధ్య అరగంటకు పైగా భేటీ జరిగింది.
అయితే వారి సమావేశ వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు నడ్డా సైతం తెలంగాణ పర్యటనలో సినీ తారాగణంతో భేటీ అవుతుండటం ఆసక్తి రేపుతోంది.