తెలంగాణ పట్టభద్రతుల ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. అటు పల్లా, ఇటు పీవీ కూతురు సురభివాణీ ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలు గెలిచిన ఇద్దరి అభ్యర్థులకు బీజేపీ తరపున శుభాకాంక్షలు అని… గెలిచిన తర్వాత కేసీఆర్ నవ్వులు తెలుసు… దాని వెనుక రాక్షస ఆనందం తెలుసు అని మండిపడ్డారు. బీజేపీ భయానికి కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడిపాడని… కెసీఆర్ కు బిజెపి చుక్కలు చూపించిందని పేర్కొన్నారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, నిరుద్యోగులు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఎన్నికల్లో ఏవిధముగా గెలిచారో రాష్ట్ర ప్రజలకు, ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసని.. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఫైర్ అయ్యారు. గురుతర బాధ్యతలను కెసిఆర్ కు అప్పగిస్తే రాక్షస పాలన చేస్తున్నాడని.. టీఆర్ఎస్ పార్టీ కి పుట్టగతులు లేవనీ కాంగ్రెస్ పార్టీ కి చెందిన PV నర్సింహ రావు ఫోటో పెట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పివి నరసింహారావు గెలిచారా..?కేసీఆర్ గెలిచారా..? నైతిక విజయం బీజేపీ దే అని పేర్కొన్నారు. కెసీఆర్ నేర్పిన భాషనే మాట్లాడుతున్నానని..భాష విషయంలో కెసిఆరే తనకు గురువు అని ఎద్దేవా చేశారు. ఆయన వద్ద నేర్చుకున్న భాషను ఆయనకే అప్పగిస్తామని కేసీఆర్కు చురకలు అంటించారు. కెసీఆర్ను వదిలిపెట్టం…యుద్దాన్ని కొనసాగిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.