telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఆంధ్రప్రదేశ్ అమరావతిలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ కొత్త క్యాంపస్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది.

వెయ్యి కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు చేయబోతున్నట్టు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, బిర్లా గ్రూప్ చైర్ పర్సన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు.

ఈ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ (ఏఐ ప్లస్) క్యాంపస్‌లో రెండు దశల్లో ఏడు వేల మంది విద్యార్థులు అభ్యసించేలా తీర్చిదిద్దనున్నారు.

35 ఎకరాల్లో విస్తరించనున్న ఈ క్యాంపస్‌ 2027 నుంచి సేవలు ప్రారంభించనుంది.

ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, ఏఐలో మాస్టర్స్ ప్రోగ్రాం, మెషీన్ లెర్నింగ్, ఇన్నోవేషన్, స్ట్రాటజీ వంటి కోర్సులను ప్రవేశపెడతారు.

ఇది కాకుండా యూనివర్సిటీలో భౌతిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, దీర్ఘకాలిక పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాల పెంపు కోసం మరో రూ. 1,219 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వర్సిటీ ఉప కులపతి వి.రామ్‌గోపాల్ రావు తెలిపారు.

అలాగే, ఇనిస్టిట్యూట్ తన సొంత ఎడ్యుకేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ బిట్స్ పిలానీ డిజిటల్‌ను ప్రారంభించింది. ఇందులో ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాలను అందించనుంది.

రాబోయే ఐదేళ్లలో బిట్స్ పిలానీ డిజిటల్ 11 డిగ్రీ, 21 సర్టిఫికెట్ ప్రోగ్రాంలతో సహా 32 ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తుందని రామ్‌గోపాలరావు తెలిపారు.

2030 నాటికి భారతదేశంలోని టాప్ 5, ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 విద్యా సంస్థలలో ఒకటిగా ఉండాలని ఈ సంస్థ యోచిస్తోందని కుమార మంగళం బిర్లా అన్నారు.

అమరావతిలో బిట్స్ క్యాంపస్ ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని, తక్కువ ధరకే భూములు ఇచ్చారని కుమారమంగళం బిర్లా అన్నారు.

ఈ క్యాంపస్ ఆయన దార్శనికతకు ప్రతిబింబంలా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయని, ఆర్కిటెక్చర్ ఎంపిక చివరి దశలో ఉన్నట్టు చెప్పారు.

కాగా, అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోంది.

కంప్యూటర్ సైన్స్‌లో ఇక్కడ అన్ని రకాల ముఖ్యమైన ప్రోగ్రాములు ఉంటాయి. దీంతోపాటు పలు మైనర్ ప్రోగ్రాములు కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు.

ఏఐలో అన్ని బేసిక్ కాన్సెప్ట్‌లు నేర్చుకుంటారని, వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు రామ్‌గోపాలరావు వివరించారు.

Related posts