సీనియర్ ఐపీయస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై జగన్ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సస్పెన్షన్ ఉత్తర్వులు తనకు ఇంకా అందలేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. తాను సోషల్ మీడియాలోనే తన సస్పెన్షన్ ఉత్తర్వులు చూశానని ఆయన చమత్కరించారు.
తనపై ఏసీబీ కేసుల ఉన్న మాట వాస్తవమేనని, ఒకటిన్నర సంవత్సర క్రితం కేసు రిజిస్టర్ చేసినా ఇంతవరకూ ఛార్జిషీట్ వేయలేదని పేర్కొన్నారు. ట్రయల్ మొదలు కాకుండా తాను సాక్షులను ఎలా ప్రభావితం చేస్తానని ఆయన ప్రశ్నించారు. ఈ సలహా ఏ తీసేసిన తాహసిల్దార్ ఇచ్చారో, పనికిమాలిన సలహాదారు ఇచ్చారో ?అంటూ మండిపడ్డారు.
12 సీబీఐ, 6 ఈడీ కేసుల్లో జగన్‌కు ఛార్జిషీట్ లు ఉన్నాయని గుర్తు చేశారు.. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపైన చార్జిషీట్లుఉన్నాయి. వారికి వర్తించని నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. తనపై అక్రమంగా కేసు నమోదయిందన్నారు.
ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతీ వాక్యం తప్పు ..అని తాను నిరూపిస్తానని అన్నారు. ఒక్క రూపాయి అవినీతి జరగని చోట కేసు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. ఇజ్రాయిల్ వాళ్ళకు రెండు లేఖలు రాసినా అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేశామని వారు చెప్పారు. కొన్ని శక్తులు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు.
కోడికత్తిని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే తాను అడ్డుకున్నానని ఏబీ వివరించారు. వెధవ పనులన్నింటికీ అడ్డుకున్నందుకే తనను టార్గెట్ చేశారని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. సస్పెండ్ చేస్తే మళ్లీ న్యాయపోరాటం చేస్తానని ఏబీ హెచ్చరించారు.
సమాజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్నాను. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసేకంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఒక కవి అన్నాడు’’ అని ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడారు.