దేశంలో ప్రతి ఒక్కరు మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాము. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా ఫిబ్రవరి 5వ జరుపుకుంటున్నారు.
నేడు వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలతో దేవాలయాలు కోలాహలంగా మారాయి.
తెలుగు రాష్ర్టం అయిన తెలంగాణలో అదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమివేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దూర ప్రాంతాల నుంచి భక్తులు బాసరకు పోటెత్తారు.
చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజు నాడు బాసర అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు దండిగా ఉంటాయని భక్తుల అపారనమ్మకం. ఇందులో భాగంగా అక్షర శ్రీకార మండపంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉదయం నాలుగు గంటలకే ప్రారంభమయ్యాయి.
అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడితో బాసర క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. అమ్మవారి దర్శనం కోసం భక్తజనం క్యూలైన్లలో బారులు దీరారు.
కాగా అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో బాసర వాగ్దేవి.. సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోందని భక్తులు చెబుతున్నారు.

