telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రధానికి ఘన స్వాగతం పలకనున్న కేసీఆర్..

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు ఈవేళ రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌లో శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంతో పాల్గొనడంతో పాటు పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు.

తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ఆయనతోపాటే హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అక్కడి నుంచి ముచ్చింతల్‌కు వస్తారు. ప్రధాని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యే వరకూ సీఎం మోదీతోనే ఉండనున్నారు. ఇక్రిశాట్‌, ముచ్చింతల్‌ల్లో జరిగే కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే పాల్గొన‌నున్నారు.

ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ప్రధాని మోదీ పంచలోహాలతో రూపొందించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయ‌నున్నారు.

రామానుజాచార్యుల జీవిత ప్రస్థానం, బోధనలపై 3డీ మ్యాపింగ్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలను సైతం సంద‌ర్శించ‌నున్నారు.

ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్‌, కిషన్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారు.

సమతా స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని సుమారు మూడు గంటల సేపు పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్రం విశిష్టతలను చిన జీయర్‌ స్వామి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించనున్నారు. రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రధాని హెలికాప్టర్‌ ద్వారా విహంగ వీక్షణం చేసేలా ఏర్పాట్లు చేశారు.

 

Related posts