telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యువతి సజీవదహనంపై .. బంగ్లా కోర్టు సంచలన తీర్పు.. 16మందికి మరణశిక్ష..

bangla court hang judgement to 16 on

బంగ్లాదేశ్‌ న్యాయస్థానం 19 ఏళ్ల యువతిని సజీవ దహనం చేసిన కేసులో 16 మందికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. తమ విద్యాలయాలయానికి చెందిన ప్రధానాధ్యాపకుడు తనను లైంగికంగా వేధించినట్లు చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు నిరాకరించటంతో ఆమెపై నిందితులు కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేశారు. కిక్కిరిసిన కోర్టు హాలులో న్యాయమూర్తి ఈ తీర్పు వెలువరించిన అనంతరం ప్రాసిక్యూటర్‌ హఫీజ్‌ అహ్మద్‌ మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో చట్టబద్ధమైన పాలన వుందని, ఇక్కడ హత్య చేసి ఎవరూ తప్పించుకోలేరన్న విషయాన్ని న్యాయస్థానం తన తీర్పు ద్వారా రుజువు చేసిందని వ్యాఖ్యానించారు. గత ఏప్రిల్‌ ఐదవ తేదీన విద్యాలయంపై భాగంలో నిందితులు ఆమెపై దాడి చేసి తమపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని వత్తిడి చేశారు. అందుకు ఆమె నిరాకరించటంతో నిందితులు ఆమెను తాడుతో కట్టివేసి కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేశారు.

దాదాపు 80 శాతం గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఐదురోజుల తరువాత ఏప్రిల్‌ 10న మరణించింది. ఆమె దుర్మరణం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించటమే కాక, దేశంలో లైంగిక వేధింపుల కేసులు పెరుగుతున్న విషయాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది. హంతకులకు మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకారులు రాజధాని ఢాకాలో అనేక రోజులపాటు ఉధృత స్థాయిలో ఆందోళన నిర్వహించారు. దోషులుగా తేలిన వారందరికి శిక్ష పడేలా చూస్తామని ప్రధాని షేక్‌ హసీనా వారికి హామీ ఇచ్చారు. నిందితులు ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించారని, అయితే బాధితురాలు మెట్లపై నుండి కిందికి పరుగెత్తుకు రావటంతో మంటలు ఆమెను చుట్టుముట్టి తీవ్రంగా గాయపడిందని ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసు ఉన్నతాధికారి మహ్మద్‌ ఇక్బాల్‌ చెప్పారు. దిగువ కోర్టు వెలువరించిన ఈ తీర్పుపై తాము ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేస్తామని డిఫెన్స్‌ న్యాయవాదులు చెప్పారు. ఫాస్ట్‌ ట్రాక్‌ పద్ధతిలో జరిగిన ఈ కేసు విచారణకు కేవలం 62 రోజులు మాత్రమే పట్టటం గమనార్హం.

Related posts