telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు న్యూస్ ఛానెల్ ‘మహా న్యూస్’ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ‘మహా న్యూస్’ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.

ఇది బీఆర్ఎస్ పార్టీకి చెందిన గూండాల పనేనని, పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నమేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ దాడి కేవలం ఒక భవనం మీద జరిగింది కాదని, ఇది నేరుగా పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి అని బండి సంజయ్ అన్నారు.

ఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ జర్నలిజం గురించి గొప్పగా మాట్లాడుతుందని, కానీ ఇప్పుడు ఏకంగా ఒక మీడియా కార్యాలయంపైకి తమ మనుషులను పంపి ధ్వంసం చేయించడం వారి ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని విమర్శించారు.

“మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మద్దతుదారులు ఎంతోమందిపై సామాజిక మాధ్యమం వేదికగా అసత్య ప్రచారాలు చేశారు, దూషించారు. అప్పుడు మేము మీ ఇళ్ల మీదకు దాడులకు దిగామా?” అని ఆయన ప్రశ్నించారు.

ఇటీవల ఒక టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరిపై ఆత్మహత్య ప్రేరణ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ఈ దాడికి పాల్పడిందని ఆయన ఆరోపించారు.

తమపై ఉన్న ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, భయానక వాతావరణం సృష్టించి మీడియా గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఒకప్పుడు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన మహా న్యూస్ ఛానెల్‌పైనే ఇప్పుడు దాడికి దిగడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

“మీరు కెమెరాలను పగలగొట్టగలరు కానీ నిజాన్ని కాదు. గొంతులను మూయించగలరు కానీ ప్రశ్నలను ఆపలేరు. ఒక ఛానెల్‌పై దాడి చేయగలరు కానీ జర్నలిజాన్ని అంతం చేయలేరు” అంటూ హెచ్చరించారు.

ఇది కేవలం తప్పిదం మాత్రమే కాదని, చట్ట ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts