పార్లమెంటులో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. పార్లమెంట్ ఆవరణలో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తాను రోజు పార్లమెంటుకు వచ్చే సైకిల్‌ను బాలకృష్ణకు చూపించారు.
దీంతో బాలకృష్ణ కాసేపు సరదాగా ఆ సైకిల్ ఎక్కి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు.
అనంతరం టీడీపీ ఎంపీలతో కలిసి స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు బాలకృష్ణ. స్పీకర్‌ను ఘనంగా సన్మానించి పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఆ తరువాత కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు వినతులను ఆయనకు సమర్పించారు.
తెలుగు దేశం పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న పార్టీ అని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ పాటుపడుతోందని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు.
ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ-2 మూవీలో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సింహా, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలోని 4వ చిత్రమిది. అఖండ-2 బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానున్నట్లు సమాచారం.