ఉత్తర్ ప్రదేశ్ లోని అయోద్య రామమందిరం భూ వివాదం కేసులో సుప్రీం కోర్టు ఈ నెల 9న తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పు పై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు ప్రకటించింది. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును వినియోగించుకుంటూ వచ్చే నెల మొదటి వారంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఏఐఎంపీఎల్‌బీ ఇవాళ వెల్లడించింది.
కాగా రివ్యూ కోరకూడదంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల తమ కేసుకు చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై తాము రివ్యూకి వెళ్లబోమంటూ నిన్న ఉత్తర ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మసీదు నిర్మాణం కోసం సుప్రీంకోర్టు కేటాయించిన ఐదు ఎకరాలు స్వీకరించాలా లేదా అన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.