telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వల్లభనేని వంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం – హైకోర్టు ఉత్తర్వులపై ఛాలెంజ్‌కు సిద్ధం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్  ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్ట్‌కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సుప్రీంకోర్ట్‌లో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి 2024 వరకు గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ నివేదిక మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఏసీబీ నమోదు చేసిన ఈ కేసులో పీటీ వారెంట్ అమలు చేస్తున్నారని హైకోర్ట్‌ను వంశీ ఆశ్రయించారు. అయితే వేకేషన్ కోర్ట్‌లో వంశీకి హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది.

దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మట్టి అక్రమ తవ్వకాలతో ప్రభుత్వానికి రూ.195 కోట్లు నష్టం జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

ఇంతటి భారీ నష్టం కలిగిన కేసులో హైకోర్ట్ బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ఆదేశాలు ఇస్తూ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో జారీ చేశారు.

హైకోర్ట్ వంశీ‌కి ఇచ్చిన బెయిల్‌ని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌లో సోమవారం స్పెషల్ లీవ్ పిటీషన్ వేసే అవకాశం ఉంది.

 

Related posts