telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కార్తికేయ సినిమాకు మరో సమస్య… మద్యపాన నిషేధం పోరాట సమితి హెచ్చరిక

90-ml

ఒకవైపు హీరోగా మరోవైపు విలన్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న యంగ్ హీరో కార్తికేయ‌. ఆర్ఎక్స్ 100, హిప్పీ, గుణ‌ 369, గ్యాంగ్ లీడ‌ర్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు కార్తికేయ. తాజాగా కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మాణంలో “90ఎం.ఎల్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. నేహా సోలంకి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, రవి కిషన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. అయితే 90ML సినిమాను అడ్డుకుంటామని మద్యపాన నిషేధం పోరాట సమితి సభ్యులు ప్రకటించారు. ఈ సినిమా ప్రదర్శితం కాకుండా శాంతియుతంగా అడ్డుకుంటామని సమితి సభ్యులు తెలిపారు. చిత్ర విడుదల సమయంలో ఐమాక్స్ థియేటర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని వెల్లడించారు. మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఈ సినిమా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పోరాట సమితి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి చిత్రాల వల్లే యువత పెడదోవ పడుతోందని, మహిళలపై అఘాయిత్యాలకు కూడా ఇదే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం సినిమాలో మద్యం సేవించే సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయని, అలాంటి సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాక చిత్ర పేరును కూడా మార్చాలి అని మద్యపాన నిషేధ పోరాట సమితి సభ్యులు తేల్చి చెప్పారు.

Related posts