గవర్నర్ నరసింహన్ అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌లో, అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రో మార్గానికి ఈ నెల 20న (బుధవారం) ఉదయం 9.15 గంటలకు పచ్చజెండా ఊపనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులను మెట్రో రైళ్లలో ప్రయాణానికి అనుమతించనున్నారు. ఈ మేరకు అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌లో ప్రారంభోత్సవ ఏర్పాట్లను హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ కేవీబీరెడ్డి, సీవోవో అనిల్‌కుమార్ సైనీ పరిశీలించారు.
ఈ మార్గంలో అమీర్‌పేటతో పాటూ మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్‌నెంబరు-5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ.. మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ మూడు స్టేషన్లను ఇప్పుడే ప్రారంభించడం లేదు. వీటి ప్రారంభానికి మరికొద్ది వారాలు పడుతుందని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తమార్గంలో ఎక్కువ మలుపులు ఉండటంతో సీఎంఆర్‌ఎస్ వేగనియంత్రణ విధించిందని చెప్పారు.
హైటెక్‌సిటీ స్టేషన్ తర్వాత మెట్రోరైలు ట్రాక్ మారేందుకు చేపట్టిన రివర్సల్ పనులు పూర్తయ్యేందుకు మరికొన్నినెలలు పడుతుందని.. అప్పటివరకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి హైటెక్‌సిటీ వరకు రైల్వేలో మాదిరి ట్విన్ సింగిల్ లేన్ విధానంలో మెట్రోని నడపనున్నట్లు ఎల్ అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. ఫలితంగా ఈ ఐదు కిలోమీటర్ల మార్గంలో రెండు ట్రాక్‌లపై వెళ్లిన మెట్రోరైళ్లు తిరిగే అవే ట్రాక్‌లపై వెనక్కి తిరిగి వస్తాయని చెప్పారు. ఈ కారణంగా అమీర్‌పేట-హైటెక్‌సిటీ మధ్యలో 9 నుంచి 12 నిమిషాలకు ఒక మెట్రో తిరుగుతుందని చెప్పారు (మిగతా కారిడార్లలో 6 నిమిషాలకో మెట్రోరైలు నడుస్తోంది). హైటెక్‌సిటీ మెట్రోకి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే అంచనాతో అదనపు రైళ్లను నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు సాయపడేందుకు అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు.
రాంగోపాల్ వర్మ మనుషులు పోలీస్ స్టేషన్‌లో క్షమాపణ చెప్పారు… అందుకే కేసు వెనక్కు…!!