సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. పోలీస్ సర్వీసుకు సీబీఐ మాజీ చీఫ్ ఆలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది. పదవీవిరమణ చేసే వరకూ సర్వీసులో కొనసాగాలని కోరింది. అలోక్ వర్మ ఈనెల 31న (నేడు) పదవీవిరమణ చేయాల్సి ఉంది. ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా తక్షణమే బాధ్యతలను స్వీకరించాలని ఆయనను హోంమంత్రిత్వ శాఖ కోరింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తొలగించిన ప్రభుత్వం ఆయనను ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది.
కాగా,సీబీఐ చీఫ్‌గా తనను తొలగించడాన్ని తప్పుపట్టిన వర్మ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, జాయింట్ డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వీరి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇద్దరినీ సెలవుపై పంపింది. ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తిరిగి సీబీఐ పగ్గాలు చేపట్టిన వర్మపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన విధుల్లో చేరకపోవడంతో అల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సర్వీస్ రూల్స్ ను వర్మ భేఖాతార్ చేశారంటూ ఆయనపై విచారణకు ఆదేశించింది.