telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటన

ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు మరో షాక్ తగిలింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లేవనెత్తాల్సిన అంశాలపై నేడు ఇండియా కూటమి సమావేశం కానున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది.

ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. అలాగే, కూటమి సమావేశానికి తాము హాజరు కాబోవడం లేదని తృణమూల్ కాంగ్రెస్ ఇది వరకు ప్రకటించింది.

పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాత్రం నేటి ఆన్‌లైన్ మీటింగ్‌కు హాజరవుతారని తెలిపింది.

ఇండియా కూటమి ఐక్యంగా ఉండటంలో విఫలమైందని ఆరోపిస్తూ కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు నిన్న ఆప్ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రకటించారు.

ఇండియా కూటమితో పొత్తు కేవలం లోక్‌సభ ఎన్నికల వరకేనని పేర్కొన్నారు. ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీచేసినట్టు గుర్తుచేశారు.

బీహార్ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామన్నారు. ఉప ఎన్నికల్లోనూ ఇదే వైఖరితో ముందుకెళ్తామని వివరించారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో ఓ పోస్టు చేస్తూ శనివారం సాయంత్రం 7 గంటలకు ఇండియా కూటమి సమావేశమవుతున్నట్టు తెలిపారు.

కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌‌చార్జ్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ మాట్లాడుతూ ఇండియా కూటమి ఐక్యంగా ఉందని, కూటమి నాయకులు శనివారం ఆన్‌లైన్‌లో చర్చల అనంతరం ఢిల్లీలో సమావేశమవుతారని పేర్కొన్నారు.

బీహార్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), పహల్గామ్ దాడిపై చర్చకు డిమాండ్, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక అంశాలపై నాయకులు చర్చించే అవకాశం ఉంది.

నేటి సమావేశానికి అందరూ హాజరవుతారని జైరాం రమేశ్ తెలిపారు.

వేర్వేరు కార్యక్రమాల కారణంగా నాయకులు ఢిల్లీకి రాలేరని, పార్లమెంటు సమావేశాలకు ముందు ఆన్‌లైన్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

ఆ తర్వాత ఢిల్లీలో సమావేశమవుతామని వివరించారు.

Related posts