రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇవాళ్టితో పాలకవర్గాల గడువు ముగిసిన తొమ్మిది కార్పొరేషన్లు, 90 మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ కమిషనర్ల కార్యశాలకు మంత్రి బొత్స ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పురపాలక ఎన్నికలు జరిగేవరకు ప్రత్యేకాధికారుల పాలన ఉంటుందని స్పష్టం చేశారు.
వార్డు సభ్యుల ఎన్నికకు రిజర్వేషన్లు, విలీన గ్రామాల అంశాలు వంటి కొన్ని అవరోధాలున్నాయని.. సీఎం జగన్ ఆదేశాలకు మేరకు సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని చెప్పారు. నెలరోజుల క్రితం అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం పూర్తి స్నేహపూర్వకమైనదని.. ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్షలు ఉండబోవని బొత్స అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబంలో సభ్యులేనని.. వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. మున్సిపాలిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కమిషనర్లు ముందుకు సాగాలన్నారు.