పాఠశాలల్లో ఆన్లైన్ మల్టీ ప్లేయర్ గేమ్స్ పై నిషేధం విధిస్తూ గుజరాత్ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న పెద్ద తేడాలేకుండా చాలామంది పబ్జి గేమ్ ఆడుతూ ‘బిజీ’ అయిపోతున్నారు. అయితే గంటల తరబడి ఈ గేమ్ ఆడడంతో మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలున్నాయని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. గేమ్స్ పై పాఠశాల విద్యార్థులు బానిసలుగా మారుతుండటంతో వారి చదువులు దెబ్బతింటున్నాయని గుజరాత్ బాలల హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ జాగృతి పాండ్యా చెప్పారు.
ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం పబ్జి గేమ్ నియంత్రణకై చర్యలు చేపట్టింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులు పబ్జి గేమ్ ఆడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఆన్లైన్ మల్టీ ప్లేయర్ గేమ్స్ ఆడకుండా నిషేధం విధించాలని విద్యాశాఖాధికారులకు సర్కారు ఆదేశాలు వెలువరించింది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఆన్లైన్ మల్టీ ప్లేయర్ గేమ్స్ ఆడకుండా నిషేధం విధించాలని జాగృతి పాండ్యా డిమాండు చేశారు.

