• చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్ర సహా, విశాఖకు ఏం జరిగిందో, వై.ఎస్ హాయాంలో ఆ ప్రాంతానికి ఏం ఒరిగిందో ప్రజల మధ్య చర్చకు నేను సిద్ధం.
• వైసీపీ ప్రభుత్వం నుంచి ఏ మంత్రి వస్తాడో రావాలి.
• ఒకపక్క జనం చనిపోతుంటే, ముఖ్యమంత్రి మూడుముక్కలాట ఆడటం ఏమిటి?
• 29వేల రైతు కుటుంబాలకు అన్యాయం జరిగితే, ఉత్తరాంధ్ర నాయకులు సంబరాలు చేసుకోవడమేంటి?
• విజయసాయికి తెలియకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.
• పొరపాటున విశాఖకు రాజధాని వస్తే, ఉత్తరాంధ్ర వాసులు తమ ఆస్తులు, భూములను కాపాడుకోలేక చచ్చిపోతారు.
• ఇప్పటికే వైసీపీకి చెందిన అడ్డపంచెల బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయాయి.
కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని, మంత్రి మండలి, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ముఖ్యమంత్రి కనీసం గంటకూడా ప్రజారోగ్యంపై సమీక్ష చేయడం లేదన్నారు. వైద్యులు, నర్సులు భయంతో ఆసుపత్రులకు కూడా రావడం లేదని, క్వారంటైన్ కేంద్రాల్లో సరైన ఆహారం అందడం లేదన్నారు. ఒక పక్క జనం చనిపోతుంటే, ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తూ, మూడు ముక్కలాడటం దారుణమన్నారు. ఎన్నికల వేళ ఒక్కటే రాజధాని అని, అది అమరావతి అని చెప్పిన జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారంచేశారని, ఇప్పుడు ఏవిధంగా విశాఖపట్నం రాజధాని అని చెబుతారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర నాయకులు కొందరు జగన్ మెప్పుకోసం తాళం వేస్తున్నారని, సంబరాలు చేసుకోవడం నీచాతినీచమన్నారు. 29వేలరైతు కుటుంబాలు అక్కడ విలపిస్తుం టే, ఇక్కడ సంబరాలు చేయడమేంటన్నారు. విశాఖలో కొట్టేసిన 6వేల ఎకరాలను అమ్ముకోవడానికే, ఆప్రాంతంలో రాజధాని అని విషప్రచారం చేస్తున్నారన్నారు. బొత్స, ధర్మాన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హాయాంలో మంత్రులుగా ఉండి ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు. వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమ విశాఖకు రాకుండా పోయింది బొత్స వల్లేనని, ఉత్తరాంధ్రకు ఆ సమయంలో ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏదో చేస్తారని చెప్పడం సిగ్గుచేటన్నారు. దోపిడీ కోసమే విశాఖలో రాజధాని అంటున్నారని, ఇప్పటికే అడ్డపంచెల రౌడీల రౌడీయిజం ఎక్కువైందన్నారు. అభివృద్ది అనేమాట మంత్రుల నోటి నుంచి ఎలా వస్తుందో తెలియడం లేదన్న అయ్యన్న, ప్రతి ఇంటికి మూడు మాస్కులు ఇస్తానన్న ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటే ఎవరూ నమ్మరన్నారు. సమయానికి ఉద్యోగులకు జీతాలు, పింఛన్ దారులకు నెలకు రూ.3వేలు ఇవ్వలేని వాడు మూడు రాజధానులు ఎలా కడతాడో ప్రజలే ఆలోచించాలన్నారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశాడంటున్న మంత్రి అవంతితో తాను చర్చకు సిద్ధమని, ఎవరి పాలనలో విశాఖ అభివృద్ది చెందిందో, ఎవరి హాయాంలో విశాఖకు గుర్తింపు వచ్చిందో చర్చించడానికి తాను సిద్ధమని, అవంతి అందుకు సిద్ధమేనా అని మాజీ మంత్రి నిలదీశారు.
వై.ఎస్ హాయాంలో విశాఖలోని హుడాకు చెందిన 3వేల ఎకకరాలకు పైగా భూములను అన్యాయంగా అమ్ముకున్నారన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక లులూగ్రూప్, ఆదానీ సెంటర్ తరలిపోయాయన్నారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు నాయుడు దగ్గరుండి నగరాన్ని అభివృద్ది చేశారన్నారు. మొట్టమొదటిసారి విశాఖలో ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేయడాన్ని, ఫార్మా పరిశ్రమలకోసం చంద్రబాబు చేసినకృషిని విశాఖ వాసులెవరూ మర్చిపోలేదన్నారు. కేంద్రమంత్రి గడ్కరీతో మాట్లాడి నేషనల్ హైవేలు వేయించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రారంభించిన రోడ్లకు భూమిని సేకరించలేని దుస్థితిలో ఉన్నవారు అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. లక్షా50వేల ఇళ్లను చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిందని, వాటిని పేదలకు ఇవ్వలేని ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం మూడు రాజధానులు కడతామనడం విచిత్రంగా ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో తేయాకు, కాఫీ తోటల పెంపకాన్ని భారీఎత్తున ప్రోత్సహించింది చంద్రబాబేనని, టూరిజాన్ని పెద్దఎత్తున అభివృద్ది చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అల్లూరి సీతారామరాజు పార్కులో పనిచేసేవారికి జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయని వాటన్నింటిపై చర్చకు తాను సిద్ధమని, ప్రభుత్వం నుంచి ఏమంత్రి వస్తాడో రావాలని అయ్యన్న సవాల్ చేశారు. విశాఖకు అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకురావడానికి చంద్రబా బు ప్రయత్నిస్తే, భూములివ్వకుండా ఆనాడు అడ్డుకుంది వైసీపీవారేనన్నారు. ఉత్తరాంధ్రకు ఇన్ ఛార్జ్ అయిన విజయసాయి కి తెలియకుండా మంత్రులు బొత్స గానీ, మరెవరైనా సరే ఏమైనా చేయగలరా అని అయ్యన్న ప్రశ్నించారు. విజయసాయికి తెలియకుండా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడని, కలెక్టర్లు ఎవరూ కూడా మంత్రలు, ఎమ్మెల్యేలు చెప్పేది అస్సలు వినడం లేదన్నారు. జిల్లాలో ఉన్న పెద్దపెద్దనాయకులందరూ అయ్యా..అయ్యా అంటూ విజయసాయి పంచె పట్టుకొని వెనక తిరిగి పరిస్థితి వచ్చిందన్నారు. రాజధాని వస్తే ఉత్తరాంధ్రవాసులు చాలా నష్టపోతారని, వైసీపీనేతల దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువవుతాయ న్నారు. రాజధాని అమరావతికి కోర్టుల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని, పొరపాటున విశాఖకు రాజధాని వస్తే, నగర వాసులతో పాటు, ఉత్తరాంధ్రవాసులు తమ ఆస్తులు, భూములు కాపాడుకోవడానికి నానా అగచాట్లు పడాల్సి వస్తుందన్నారు. తమ భూములకు కంచెలు వేసుకొని, తమ ఆస్తులకు కాపలా కాసుకోవాల్సిన దుస్థితి వస్తుందని అయ్యన్న స్పష్టంచేశారు. ప్రజలతో పాటు, ఇతర పార్టీల నేతలు కూడా తమ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.