telugu navyamedia
క్రీడలు వార్తలు

బెంగళూరును వీడిన ఆసీస్ ఆటగాళ్లు…

రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కూడా భారీ షాకే తగిలింది. ఐపీఎల్ 2021లో బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా బౌలర్లు కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్ జంపా.. లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తాము స్వదేశానికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని బెంగళూరు కూడా ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ‘వ్యక్తిగత కారణాలతో కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్ జంపాలు ఆస్ట్రేలియాకు వెళుతున్నారు. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు వారు అందుబాటులో ఉండరు. బెంగళూరు యాజమాన్యం వారి నిర్ణయాన్ని గౌరవిస్తోంది. వారికి ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుంది’ అని ట్వీట్ చేసింది. ఐపీఎల్ 2021 కోసం భారత్‌లో ఉన్న ఆటగాళ్లు వెంటనే వెనక్కి రావాలని క్రికెట్ ఆస్ట్రేలియా సూచించినట్లు సమాచారం తెలుస్తోంది. ఒకవేళ ఇప్పుడు స్వదేశానికి రాకపోతే.. 3 నెలల పాటు రావడానికి వీల్లేదన్న షరతుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ సూచన మేరకు ఆటగాళ్లు భారత్‌ నుంచి వెనక్కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో రిచర్డ్‌సన్‌ ఒక మ్యాచ్‌లో ఆడగా.. జంపా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. ఆసీస్ ఆటగాళ్లు అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేనియల్ క్రిస్టియన్, స్టీవ్ స్మిత్, పాట్ కమ్మిన్స్, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ 2021లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ మే 30న జరగనుంది. అంటే లీగ్ ముగియడానికి దాదాపు నెల రోజుల సమయం ఉంది.

Related posts