ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా జరిగింది. విజయవాడలోని రాజ్భవన్లో ఈ రోజు మధ్యాహ్నం సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తో మంత్రులుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ తదితరులు హాజరయ్యారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో కొందరు మాత్రమే ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ రోజు మంత్రిగా ప్రమాణం చేసిన అప్పలరాజుది శ్రీకాకుళం జిల్లా. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెల్లుబోయిన వేణు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వైసీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో వారిద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో వారి శాఖలను సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు అప్పగించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు వారికి మంత్రివర్గంలో అవకాశం దక్కింది.