చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ వార్తే. ఈ వీడియోను వెంటనే తమ ప్లేస్టోర్ల నుంచి తొలగించాలంటూ గూగుల్, యాపిల్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ వల్ల పిల్లల్లో పెడధోరణులు పెరిగిపోతున్నాయంటూ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మదురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ యాప్‌ను నిషేధించాలని కోరారు.
ముత్తుకుమార్ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. ఈ యాప్ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయవద్దని మీడియాకు సూచించింది. చిన్నపిల్లలు సైబర్ నేరగాళ్ల బారినపడకుండా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి చర్యలు తీసుకున్నదీ ఏప్రిల్ 16లోగా తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో టిక్‌టాక్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది. థర్డ్ పార్టీ అప్లోడ్ చేసే వీడియోలకు తమను బాధ్యుల్ని చేయడం సరికాదని పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించి నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
విపరీతంగా పాప్యులర్ అయిన టిక్ టాక్ యాప్ యాక్సెస్ ను బ్లాక్ చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. డౌన్ లోడ్లను నిషేధించామని, మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్ పేర్కొంది. ఈ యాప్ పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందని, చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు యాప్ ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించగా, టిక్ టాక్ ను అందిస్తున్న చైనా సంస్థ బైటెండెన్స్ టెక్నాలజీ రివ్యూ పిటిషన్ వేసింది. ఈ నెల 3న టిక్ టాక్ ను నిషేధించాలన్న ఉత్తర్వులు వెలువడగా, భారత్ వంటి పెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేని బైటెండెన్స్, తన వంతు ప్రయత్నాలు చేసి విఫలమైంది. సుప్రీంకోర్టును సంస్థ ప్రతినిధులు ఆశ్రయించగా, కేసును మద్రాస్ హైకోర్టుకే బదిలీ చేస్తూ అత్యున్నత ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. యాప్ ను నిషేధించడం ఇండియాలో వాక్ స్వాతంత్రానికి విఘాతమని బైటెండెన్స్ చేసిన వాదనతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. కాగా ఇక గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ను తొలగించామని గూగుల్ ప్రటించగా, యాపిల్ మాత్రం ఇంకా స్పందించలేదు. జనవరి నాటికి ఈ యాప్ 24 కోట్ల స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాల్ అయింది.