telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిపై అనవసర రాద్ధాంతాలు వద్దు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాష్ట్రంలో మధ్యలో ఉందని రాష్ట్రానికి గుండెలా పనిచేస్తుందని చెప్పారు.

అయితే కొందరు అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, అది తగదని హితవు పలికారు. అమరావతిపై అనవసర రాద్ధాంతాలు వద్దని అన్నారు.

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయిందని అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమరావతిని రాజధానిగా గుర్తించి, అక్కడ అభివృద్ధి పనులను జోరుగా కొనసాగిస్తున్నాయని చెప్పారు.

అమరావతి అంటే కేవలం ఒక చిన్న గ్రామం కాదని విజయవాడ, గుంటూరు, గన్నవరం, మంగళగిరి ఇలా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలిసి ఒక పెద్ద నగరంగా మారనుందని తెలిపారు.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో స్వర్ణ భారత్‌ ట్రస్టులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts