telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌.. ప్రజలు సహకరించాలి: ప్రధాని మోదీ

Modi Mask

దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ రోజు జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ మే 3వ తేదీ వరకు ఇండ్లలో నుంచి ఎవరూ బయటకు రాకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కష్టమైనా, నష్టమైనా దేశం కోసం ప్రజలు నిలబడ్డారన్నారు. అంబేద్కర్ చెప్పిన మాటలు మనకు నిరంతరం ప్రేరణ ఇస్తున్నాయని మోదీ తెలిపారు. ప్రజలు ఒక్కతాటిపై నిలబడి పరస్పరం సహకరించుకోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నివాళని చెప్పారు. లాక్‌డౌన్ అమలు ఉండగానే ఉగాది నుంచి విశూ వరకు పండుగలు జరుపుకున్నామని ఆయన అన్నారు.

భారత్‌ అంటేనే భిన్న మతాలు, సంస్కృతులు, ఉత్సవాలు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ పండగలు నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా ప్రజలంతా ఒక్కటై నిలబడి పోరాడుతున్నారు. సమస్య మన దృష్టికి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకున్నాం. కరోనాను వీలైనంత త్వరగా కట్టడి చేసేందుకు అన్ని మార్గాలను అమలు పరిచాం. అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్‌ ఎంతో కొంత మంచి స్థితిలో ఉందన్నారు.

ఏప్రిల్‌ 20 నుంచి అత్యవసర విషయాలకు కొన్ని ప్రత్యేక అనుమతులు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, ఇందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఆ అనుమతులను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. లాక్‌డౌన్‌ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తేలేదని చెప్పారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత సాయం అందిస్తున్నామని చెప్పారు. ఆహార వస్తువులు, మందుల సరఫరా వంటివాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అవరోధం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Related posts