అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జొహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయం సాధించారు.
ఈ పదవిని అధిష్టించిన తొలి ఇండియన్-అమెరికన్ ముస్లింగా, అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పారు. మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై గెలుపొందడం విశేషం.
ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్, స్వయంగా ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఫలితం లేకపోయింది.
విజయం అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి జొహ్రాన్ ప్రసంగించారు.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’లోని వాక్యాలను గుర్తుచేసుకున్నారు.
“ఒక శకం ముగిసి, నవశకం వైపు అడుగు వేస్తున్నప్పుడు చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయి.
సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి గళం వినిపించిన సమయం ఇది” అని తన గెలుపును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సోషలిస్టు భావజాలం కలిగిన జొహ్రాన్, ఉగాండా జాతీయుడైన మహమూద్ మమ్దానీ, ప్రఖ్యాత భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్ల కుమారుడు.
తన ప్రసంగంలో తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ, “నన్ను తీర్చిదిద్దింది మీరే. మీ కుమారుడినైనందుకు గర్వంగా ఉంది” అని అన్నారు.
వచ్చే ఏడాది జనవరి 1న తాను మేయర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు జొహ్రాన్ వెల్లడించారు.


సాక్షి బరితెగించి రాతలు రాసింది: సోమిరెడ్డి