ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ రహదారుల రూపురేఖలను మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది.
రాష్ట్రంలోని పల్లెల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్ల పునర్నిర్మాణం కోసం ‘స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ (సాస్కీ) పథకం కింద రూ.2,000 కోట్లు మంజూరు చేసింది.
ఈ నిధులతో గ్రామాల్లో రహదారుల వ్యవస్థను మెరుగుపరచనున్నట్టు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారుల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
పనులు చేపట్టే కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు.
నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పలు దశల్లో నాణ్యతను తనిఖీ చేయడం తప్పనిసరి అని తెలిపారు.
ప్రమాణాలకు విరుద్ధంగా పనులు చేపట్టినా, ఏవైనా అవకతవకలు జరిగినట్టు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పుట్టపర్తిలో జరగనున్న శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని అక్కడి పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.35 కోట్లు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంతో ప్రతి గ్రామానికీ పటిష్టమైన, దీర్ఘకాలం మన్నే రహదారులను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

