telugu navyamedia
International క్రైమ్ వార్తలు వార్తలు

పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు అఫ్గానిస్థాన్‌ క్రికెటర్ల మృతి

పాకిస్థాన్‌ మరోసారి దాని దురాగతం బయటపడింది. భారత్‌పై ఇటీవల సైనికులతో యుద్ధానికి దిగిన పాక్‌ ఈసారి తన మరో సరిహద్దు దేశం అఫ్గానిస్థాన్‌పై దాడికి పాల్పడింది. తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్థాన్‌ వైమానిక దళం బాంబు దాడులు జరిపింది.

ఈ దాడిలో ఎనిమిది మంది మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు క్రికెటర్లు ఉన్నట్లు అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ACB) ధ్రువీకరించింది.

ఈ సందర్భంగా ఏసీబీ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది.

“పాక్టికా ప్రావిన్స్‌లోని ఉరుగూన్ జిల్లాకు చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు పాకిస్థాన్‌ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పాక్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది పౌరులు మరణించారు.

వారిలో ముగ్గురు అఫ్గాన్‌ క్రికెటర్లు కబీర్‌ అఘా, సిబ్గుతుల్లా, హరూన్‌ ఉన్నారు. పాక్టికా రాజధాని శరణలో స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడిన అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

అఫ్గాన్‌ అథ్లెట్‌ క్రికెటింగ్‌ కుటుంబానికి ఇది తీరని లోటు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. గాయపడిన పౌరులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.

పాకిస్థాన్‌ పాల్గొనబోయే ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి వైదొలగాలని మేము నిర్ణయించుకున్నాం” అని అఫ్గాన్ బోర్డు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

Related posts