ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ సుమారు రూ.9 వేల కోట్ల తెలంగాణ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది.
ఈ క్రమంలో దేశంలోనే మొదటిసారిగా తమ మాన్యుఫాక్చరింగ్ హబ్ హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.
ఆ కంపెనీ నిర్ణయంతో ప్రపంచ స్థాయి ఔషదాల తయారీ, సేవల విస్తరణను ఇక్కడి నుంచే నిర్వహించనుంది.
హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎలీ లిల్లీ అండ్ కంపెనీ ప్రతినిధులు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే పెట్టుబడులకు చిరునామాగా తెలంగాణ మారిందని తెలిపారు.
ఎలీ లిల్లీ అండ్ కంపెనీ విస్తరణలో భాగంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావడం ఆనందకరమని చెప్పారు.
రాష్ట్రంపై నమ్మకం ఉంచినందుకు ఆ కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఎప్పుడూ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
1961లో ఐడీపీఎల్ స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్ దిగ్గజ ఫార్మా కంపెనీలకు కేంద్రంగా మారిందన్నారు.
ప్రస్తుతం 40 శాతం బల్క్ డ్రగ్స్ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లనూ ఇక్కడే తయారు చేశామని, ఫార్మా కంపెనీలను ప్రోత్సహించేలా ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తోందని సీఎం తెలిపారు.
జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్కడ కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని సీఎం వివరించారు.