మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
ఆవిష్కరణల రంగంలో భారత్ ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలుస్తోందని, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా ఉందని ఆయన కొనియాడారు.
భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మెరుగుపరిచే శక్తిని కలిగి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికాలోని సియాటిల్‌లో భారత కాన్సులేట్ జనరల్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ కార్యక్రమానికి హాజరైన బిల్ గేట్స్ మాట్లాడుతూ “ఈ రోజు భారత్ ఆవిష్కరణల్లో గ్లోబల్ లీడర్‌గా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను కాపాడి, మెరుగుపరిచే పరిష్కారాలను అందిస్తోంది.
‘వికసిత భారత్ 2047’ లక్ష్య సాధనలో భారత్‌తో మా భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
గాంధీజీ ఆశయాలైన సమానత్వం, గౌరవం తమ ఫౌండేషన్ పనికి పునాది వంటివని గేట్స్ పేర్కొన్నారు.