telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్ తమ పక్షానే ఉందని స్పష్టం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంలో భారత్‌ను నిందించలేమని, ఆ దేశం చాలావరకు తమ పక్షానే ఉందని స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రష్యాతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూ భారత్, చైనాలు యుద్ధానికి దోహదపడుతున్నాయా? అని ఇంటర్వ్యూలో హోస్ట్ బ్రెట్ బేయర్ ప్రశ్నించారు.

దీనికి జెలెన్‌స్కీ బదులిస్తూ, “లేదు, భారత్ చాలావరకు మా వైపే ఉంది. ఇంధన రంగంలో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ వాటిని పరిష్కరించుకోవచ్చు” అని అన్నారు.

భారత్‌కు ఇంధన అవసరాలు ఉన్నాయని, ఈ సమస్యకు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపితే బాగుంటుందని ఆయన పరోక్షంగా సూచించారు.

గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, తమ దేశ ప్రయోజనాలకు, ప్రజల అవసరాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని భారత్ గట్టిగా బదులిచ్చింది.

ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదే ఇంటర్వ్యూలో చైనా, ఇరాన్ దేశాల వైఖరిపై కూడా జెలెన్‌స్కీ మాట్లాడారు. “ఇరాన్ ఎప్పటికీ మా పక్షాన నిలవదు. ఎందుకంటే ఆ దేశం అమెరికాకు వ్యతిరేకం. ఇక చైనా విషయానికి వస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాకు వ్యతిరేకంగా నిలవడం ఆ దేశానికి ప్రయోజనకరం కాదు” అని ఆయన పేర్కొన్నారు.

Related posts