telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కార్మికుల పని గంటల పెంపు బిల్లు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు.

కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచుతూ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన, ఎన్నో ఏళ్ల పోరాటంతో కార్మికులు సాధించుకున్న హక్కులను హరించేలా ఈ బిల్లు ఉందని దుయ్యబట్టారు.

ఇంత హడావుడిగా ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందని బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ బిల్లులో మహిళా కార్మికుల భద్రతకు సంబంధించి కూడా ఎలాంటి స్పష్టత లేదని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా, జీఎస్టీ అంశంపై చర్చ సందర్భంగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. “చపాతీ, రోటీపై జీఎస్టీ లేదంటున్నారు. మరి ఇడ్లీ, దోశపై పన్ను ఉందా? లేదా? అని అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే 18 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్‌లో మాట్లాడాలని సూచించినా పట్టించుకోలేదు” అని ఆయన విమర్శించారు.

చేనేత కార్మికులకు అవసరమైన ముడి సరుకులపై జీఎస్టీని తొలగించమని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.

ప్రభుత్వం ఇచ్చిన నోట్‌ను చదివి వెళ్లిపోవాలన్నట్లుగా వారి వైఖరి ఉందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

Related posts