telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఐసీఏఐ గుంటూరు నిర్వహించిన సీఏ విద్యార్థుల సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు

ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అన్నది భారతదేశ మేధోశక్తికి వెన్నెముక లాంటిది. ఐసీఏఐ స్థాపించి 76 సంవత్సరాలు నిండినా ఆ సంస్థ ఇప్పటికీ నవ్యోత్సాహంతో ఉంది.

ఇది భారతదేశంలో అతిపెద్ద సంస్థగా మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్‌హౌస్ గా ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

గుంటూరు బండ్లమూడి గార్డెన్స్ లో ఐసీఏఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యాన ‘స్ఫూర్తి’ పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ ఐసీఏఐ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందింది.

ప్రపంచంలో ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రమాణాలతో పనిచేస్తున్న మొట్టమొదటి సంస్థ ఇది. ఐసీఏఐ ద్వారా 10 లక్షల మందికి పైగా చార్టర్డ్ అకౌంటింగ్ విద్యను అభ్యసిస్తుండగా, ప్రతియేటా 2 లక్షలమంది పరీక్షలు రాస్తున్నారు.

4.07 లక్షల మంది సభ్యులు, 54 విదేశీ చాప్టర్లు కలిగిన అతిపెద్ద సంస్థ ఐసీఏఐ. భారతదేశం గర్వించదగిన ఐసీఏఐ కుటుంబ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాకపోయినా స్టాన్ఫోర్డ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ గా సీఏ ప్రాధాన్యత నాకు తెలుసు.

ఇది కేవలం ఒక కోర్సు కాదు, నిబద్ధతతో కూడుకున్న విద్య. మా కుటుంబ వ్యాపారాల్లో సీఏల కష్టాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను.

వ్యాపారాల్లో స్పష్టత లోపించినపుడు మేము సీఏ వైపే చూస్తాము. పాలనా వ్యవస్థలో బడ్జెట్ ఆమోదం ఉన్న ప్రతి ప్రభుత్వ ఫైల్‌కు ఆడిటర్ల ఆమోద ముద్ర అవసరం.

సీఏలు కేవలం సంఖ్యా విశ్లేషకులు మాత్రమే కాదు, వారు ఆర్థిక వృద్ధి చోదకులు. వారు వ్యాపారాలకు మూలధనాన్ని సేకరించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి సహాయం చేస్తారు.

ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ డి. ప్రసన్నకుమార్, సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (SIRC) వైస్ ఛైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు,

గుంటూరు బ్రాంచీ ఛైర్మన్ ఎన్. రాజశేఖర్, సదరన్ ఇండియా చార్టర్డ్ అకౌంటెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ (SICASA) గుంటూరు బ్రాంచీ ఛైర్మన్ చింతా రఘునందన్, వైస్ ఛైర్మన్ బి. ఝాన్సీ లక్ష్మి, కార్యదర్శి వనిమిరెడ్డి వి. నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts