ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలోనూ ఈ వ్యాక్సిన్ కోసం పరిశోధకులు ప్రయత్నిస్తూ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ అమెరికాలో నవంబర్ 1లోపు అందుబాటులోకి రానుందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ అందేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. అయితే, అంత త్వరగా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచి అన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశముందని ఫౌచీ చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏడాది లోపు ప్రపంచం తిరిగి సాధారణ పరిస్థితికి చేరుకోగలదని తెలిపారు.