telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆంధ్రాలో ఉగ్ర లింకులకు గత ప్రభుత్వం బాధ్యమే – హోంమంత్రి అనిత

విజయనగరం, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఉగ్ర లింకులు బయటపడటంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు.

ఈరోజు (గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లో ఉగ్రలింకులు బయటపడటానికి గత ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని ఆరోపించారు.

ఉగ్ర లింకుల కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో ఉండటం వల్ల దర్యాప్తు మరింత లోతుగా జరుగుతోందని తెలిపారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌ మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా గంజాయి నియంత్రణపై సమీక్షా సమావేశం జరిపిన ఆధారాలు లేవన్నారు.

గంజాయి పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి కలిగించేలా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

జగన్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తున్నా తనకు జెడ్ ప్లస్ పద్ధతి కల్పించాలని అడగటం గమనార్హమన్నారు.

జగన్‌ను మించిన దగాకోరు ఈ దేశంలో ఎవరూ లేరని.. ఆయన పక్కనున్న సత్తిబాబు ఇంకా పెద్ద దగాకోరంటూ హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాగా.. రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో పోలీసు బృందాలు రంగంలోకి దిగి విచారణను ముమ్మరం చేశాయి.

అరెస్ట్ అయిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిక్ భార్య సైరా బాను, మహమ్మద్ అలీ భార్య షమీమ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించారు.

అలాగే ఉగ్రవాది మహమ్మద్ అలీ వరుసకు సోదరుడు మహబూబ్ బాషా బావమరిది జమాల్‌నూ కాప్స్ అదుపులోకి తీసుకుని విచారించారు.

అనంతరం ఉగ్రవాదుల భార్యలను పోలీసులు రాయచోటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చారు.

ఇరువురికీ 14 రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో వారిని పోలీసులు రాయచోటి సబ్‌జైలుకు తరలించారు.

Related posts